Deepfake Cyber Fraud | డీప్‌ఫేక్ వీడియో కాల్‌తో రూ.80 వేల టోకరా

Deepfake Cyber Fraud | డీప్‌ఫేక్ వీడియో కాల్‌తో రూ.80 వేల టోకరా

Deepfake Cyber Fraud | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేర్లను ఉపయోగిస్తూ విశాఖపట్నంలో హైటెక్ సైబర్ మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ఓ వ్యక్తిని నమ్మించి రూ.80 వేల మేర మోసగించినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం… కేటుగాళ్లు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫొటోతో వాట్సాప్ ఖాతా సృష్టించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుతో డీప్‌ఫేక్ వీడియో కాల్ చేసి బాధితుడు శ్రీనివాసరెడ్డిని నమ్మించారు.

వివిధ కారణాలు చెబుతూ డబ్బు అవసరమని చెప్పడంతో బాధితుడు వారి మాటలను నమ్మి రూ.80 వేలు బదిలీ చేసినట్లు సమాచారం. అనంతరం తాను మోసపోయానని గుర్తించిన శ్రీనివాసరెడ్డి విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల పేర్లతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పంపవద్దని హెచ్చరించారు.