Vijayawada రక్తదానంలో నారీ శక్తి.. దృశ్యం

Vijayawada రక్తదానంలో నారీ శక్తి..

  • 60 ఏళ్ల మహిళతో సహా మహిళల రక్తదానం.. అపోహలకు చెక్ పెట్టిన కార్యక్రమం

విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ:

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సూర్యారావుపేటలోని ప్రముఖ అమెరికన్ క్యాన్సర్ కేర్ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మహిళల రక్తదానంపై, అలాగే వయస్సుపై సమాజంలో ఉన్న పాతకాలపు అపోహలను తొలగిస్తూ పలువురు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ప్రత్యేకంగా 60 ఏళ్ల వయసు గల ఓ మహిళ ఉత్సాహంగా రక్తదానం చేయడం అక్కడ ఉన్న వారందరిలోనూ కొత్త స్ఫూర్తిని నింపింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ బొబ్బా రవికిరణ్ మాట్లాడుతూ మహిళలు రక్తదానం చేయకూడదన్నది, వయస్సు పైబడిన వారు రక్తదానం చేయరాదన్నది పూర్తిగా అపోహలేనని స్పష్టం చేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మహిళా నిర్భయంగా రక్తదానం చేయవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల సమయంలో రక్తం, ప్లేట్లెట్ల అవసరం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని అభినందించారు.

రక్తదాన శిబిరంలో సేకరించిన ప్రతి యూనిట్ రక్తం క్యాన్సర్ రోగుల చికిత్సకు ఎంతో ఉపయుక్తమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. మహిళల భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.