Peddi | ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్!

Peddi | ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్!

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు భిన్న నిర్ణయాలు తీసుకోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా విడుదలకు ముందు జూన్ 3 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు నిర్మాతలు అనుమతులు కోరగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. అలాగే విడుదలైన తర్వాత ఒక వారం పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ‘పెద్ది’ ఓపెనింగ్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక తెలంగాణలో పరిస్థితి భిన్నంగా మారింది. అక్కడ కూడా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులు కోరుతూ నిర్మాతలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వకుండా విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. సినిమా విడుదల తర్వాత విచారణ వల్ల ప్రయోజనం ఉండదని భావించిన నిర్మాతలు అనంతరం పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఎలాంటి ప్రత్యేక అనుమతులు లభించలేదు.

ఇప్పటికే భారీ బడ్జెట్, రామ్ చరణ్ మాస్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతం, జాన్వీ కపూర్ జోడీ, పాన్ ఇండియా స్థాయి ప్రమోషన్లతో ‘పెద్ది’పై భారీ హైప్ నెలకొంది. ఉత్తర అమెరికాలో ప్రీ-సేల్స్ కూడా భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో టికెట్ ధరల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తానికి.. ఏపీలో రూ.600 ప్రీమియర్ టికెట్లు.. తెలంగాణలో సాధారణ రేట్లు.. అనే పరిస్థితి ఏర్పడటంతో ‘పెద్ది’ విడుదలకు ముందే సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

One thought on “Peddi | ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్!

Leave a Reply