శిక్షణతో పార్టీ మరింత బలోపేతం..
వాస్తవాధారిత రాజకీయాలతో ప్రజల్లో విశ్వాసం పెంచాలి
కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక..
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమర్థంగా పనిచేయాలి
టీడీపీ శిక్షణా కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా
ఆంధ్రప్రభ విజయవాడ : క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్, యూనిట్ ఇంచార్జిల శిక్షణా కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌తో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు స్పష్టంగా వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన వెన్నెముక అని ఆయన అన్నారు. కార్యకర్తల పనితీరు, ప్రజల్లో పార్టీ బలం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అన్నీ డిజిటల్ విధానంలో నమోదు కావడం ద్వారా పార్టీ మరింత పటిష్టమవుతుందని తెలిపారు.
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోందని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు అందుకు నిదర్శనమని చెప్పారు. సంక్షేమం–అభివృద్ధి అనే రెండు చక్రాలపై కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రత్యర్థి పార్టీల తీరును వాస్తవాలు, గణాంకాల ఆధారంగా విశ్లేషించి ప్రజలకు వివరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
పార్టీ విజయానికి, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి ప్రతి కార్యకర్త పాత్ర అత్యంత కీలకమని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భావోద్వేగాలకు అతీతంగా వాస్తవాధారిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను బలంగా చాటిచెప్పే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
