సమతుల్య ఎరువులతో ఉత్పాదకత పెరుగుదల

సమతుల్య ఎరువులతో ఉత్పాదకత పెరుగుదల
- రైతు అవగాహన సదస్సులో భూసార పరీక్ష నిపుణుడు ఇ.స్వామి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమతుల్య ఎరువుల వాడకం వల్ల పంటల ఉత్పాదకతలో పెరుగుదల ఉంటుందని భూసార పరీక్ష నిపుణుడు ఇ.స్వామి అన్నారు. జహీరాబాద్ మండలం జామ్లాయి తండా గ్రామంలో రైతులకు సమతుల్య ఎరువుల యాజమాన్యం, జీవన ఎరువులు, కషాయాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసార పరీక్ష నిపుణుడు ఇ.స్వామి రైతులకు మట్టి ఆరోగ్య కార్డుల ప్రాముఖ్యతను వివరించారు.
నేల సారాన్ని మెరుగుపరచడం, పంటల ఉత్పాదకతను పెంచడం కోసం మట్టి పరీక్షల ఆధారంగా పోషక నిర్వహణ చేపట్టడం, సమతుల్య ఎరువుల వినియోగం ఎంత ముఖ్యమో ఆయన తెలిపారు. డీడీఎస్ సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన గోవుల ఆధారిత బిఆర్‌సి యూనిట్‌పై శాస్త్రవేత్త (సస్య రక్షణ) డాక్టర్ ఎన్.స్నేహలత రైతులతో చర్చించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో ఇది ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు.
రాబోయే పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జీవామృతం యూనిట్ ఉత్పత్తి విధానం, నిర్వహణపై మరింత శిక్షణ అవసరమని రైతులు అభిప్రాయపడ్డారు. ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం ముగింపులో రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు పంపిణీ చేసి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ సూపర్‌వైజర్ చుక్కమ్మ, గ్రామ సర్పంచ్ మోహన్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మహిళా రైతులు పాల్గొన్నారు.
