AP | మైన‌ర్ బాలిక‌పై సామూహిక లైంగిక దాడి

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొందరు వ్యక్తులు మైనర్ బాలికను నాలుగు రోజుల పాటు నిర్బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్ (14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.

అనంతరం, ఈనెల 13న స్నేహితురాలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్ పై కొంతదూరం తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించి లైంగిక దాడి చేశారు.

అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ కు జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు
సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *