Farmers I మీ ఊరికే వస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు!

Farmers I మీ ఊరికే వస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగాన్ని వానాకాలం సాగుకు సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని రేపటి నుంచి మే 23 వరకు నిర్వహించనుంది. వ్యవసాయ శాఖ , ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 450 మందికి పైగా వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నారు. ప్రతి వారం సుమారు 400 గ్రామాల్లో రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు.
ఒక్కో బృందంలో నలుగురు శాస్త్రవేత్తలు ఉంటారు. వీరికి సహాయకులుగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. గ్రామాలలోని రైతు వేదికలు, పంచాయతీ కార్యాలయాలు వేదికగా ఈ సదస్సులు జరుగుతాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, ప్రధానంగా ఆరు కీలక అంశాలపై తెలంగాణలో అధికంగా ఉన్న యూరియా వినియోగాన్ని తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూ అధిక దిగుబడులు సాధించే ‘సూక్ష్మ సాగు’ పద్ధతులను వివరిస్తారు.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతుల ద్వారా పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తారు. వానాకాలం పంటలకు ముందే విత్తన శుద్ధి చేయడం, తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తారు.ఒకే రకమైన పంటలు వేయకుండా, ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తారు. సాంకేతికత వినియోగం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్’ వంటి డిజిటల్ సాధనాలపై రైతులకు శిక్షణ ఇస్తారు.
ఈ కార్యక్రమం కేవలం రైతులకు సూచనలు ఇవ్వడమే కాకుండా, శాస్త్రవేత్తలు , విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను ప్రత్యక్షంగా చూసి, వాటి పరిష్కారానికి కొత్త పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తుందని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వ్యాపార సాగు దిశగా అడుగులు వేయాలనుకునే రైతులు తమ సమీపంలోని రైతు వేదికల వద్ద జరిగే ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.
