Gadwal ఫోక్సో కోర్టు తీర్పు.. నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

Gadwal ఫోక్సో కోర్టు తీర్పు.. నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

రూ.1,000 జరిమానా విధింపు.. విచారణ అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

గద్వాల (Gadwal), ఆంధ్రప్రభ:

మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. కేటీదొడ్డి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలతో లోబరుచుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిపై కేసు నమోదు అయింది. ఘటన సమయంలో చుట్టుపక్కల వారు గమనించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేపట్టి చార్జిషీట్ దాఖలు చేశారు. తదనంతరం కోర్టులో విచారణ కొనసాగింది.
ట్రయల్ సమయంలో జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మొగిలయ్య పర్యవేక్షణలో, కేటీదొడ్డి ఎస్సై శ్రీనివాస్ సాక్షులను సమర్థంగా సమన్వయం చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు సమర్పించడంతో కోర్టు తీర్పు వెల్లడించింది.

నిందితుడు ఎరుకలి కాశిమన్న అలియాస్ పెద్ద కాశిమన్న (చింతలకుంట గ్రామం)కు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. ఈ కేసులో పకడ్బందీగా విచారణ చేపట్టి నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులు టంగాటూరి శ్రీను, ఎస్సై శ్రీనివాస్, పీపీ విజయ్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు ఎస్సై జిక్కి బాబు, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుల్ మహేష్‌ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ అభినందించారు.