Bhatti Vikramarka | విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు
- 70 వేల మందికి లాభం..
- 1.621 శాతం డీఏ పెంపునకు ఆమోదం
- భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇప్పటినుంచే ప్రణాళికలు : భట్టి
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 1.621 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపునకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 17.651 శాతంగా ఉన్న డీఏ 19.272 శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయంతో మొత్తం 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణపై డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2035-36 నాటికి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో, అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసార, పంపిణీ రంగాల్లో పెట్టుబడులు పెంచడం అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
