Future City Telangana | గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేలా ప్రభుత్వం వ్యూహం
Future City Telangana | గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేలా ప్రభుత్వం వ్యూహం
Future City Telangana | ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు భారీ కసరత్తు
ఐఐఎం అనుమతిపై ఉత్కంఠ – కేంద్ర నిర్ణయంపై ఆశలు
Future City Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: కొత్తగా ఏర్పాటుకానున్న ఫ్యూచర్ సిటీలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రీడా వర్సిటీతో పాటు ఇతర సంస్థల ఏర్పాటుపై వివరించారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని సేకరించి సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్యానికి పూర్తి సహకారం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఐఐఎం అనుమతికి పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర విద్యా శాఖ వర్గాలు సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట, కురుమిద్ద గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
పెట్టుబడిదారులతో సమావేశాలు, అవగాహన ఒప్పందాల కోసం తెలంగాణ పరిశ్రమల శాఖ నిర్మించిన భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇకపై వారంలో ఒక రోజు పూర్తిగా ఫ్యూచర్ సిటీలోనే ఉండి పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఫ్యూచర్ సిటీలోని 10 వేల ఎకరాల్లో ప్రత్యేక ఎడ్యుకేషన్ జోన్ (హబ్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా, కెనడా, సింగపూర్, జర్మనీ, యూకే దేశాలకు చెందిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చి రాయితీలతో భూములు కేటాయించే ప్రణాళికలు రూపొందుతున్నాయి. యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి (స్కిల్ వర్సిటీ), యంగ్ ఇండియా క్రీడా వర్సిటీని కూడా ఈ జోన్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఐఐఎం తరగతులను స్కిల్ వర్సిటీలో ప్రారంభించి, శాశ్వత భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాదన ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్యూచర్ సిటీ సమీపంలో ఉండటంతో విదేశీ అధ్యాపకులు, విద్యార్థులు సులభంగా చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెట్రో విస్తరణ, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు పూర్తయితే మరింత వేగంగా రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ చుట్టూ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గచ్చిబౌలి వద్ద హెచ్‌సీయూ, కందిలో ఐఐటీ హైదరాబాద్, బీబీనగర్ వద్ద ఎయిమ్స్, హైదరాబాద్-రామగుండం మార్గంలో నల్సార్, ఐపీఈ వంటి సంస్థలు ఇప్పటికే ఉన్నాయి.
రాజేంద్రనగర్, బుద్వేల్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఐఐఎం వంటి సంస్థలను మరింతగా ఆకర్షించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భవిష్యత్తులో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు కూడా భారత్ ఫ్యూచర్ సిటీలోనే భూములు కేటాయించాలని ప్రతిపాదన ఉంది. హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–నాగ్‌పూర్ జాతీయ రహదారుల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతాల్లో కొత్త విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుపై కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నారు.
