Network Survey Vehicle | రోజుకు 300 కి.మీ సర్వేతో వేగవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ

Network Survey Vehicle | రోజుకు 300 కి.మీ సర్వేతో వేగవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ

Network Survey Vehicle | నెట్‌వర్క్ సర్వే వెహికల్‌తో హైవేల్లో అత్యాధునిక స్కానింగ్
ఏఐ ఆధారిత డేటాతో రహదారి నిర్వహణలో పారదర్శక విప్లవం

Network Survey Vehicle | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఆహ్లాదకరమైన ఉదయం వేళ, ఎంతో రద్దీతో గందరగోళంగా ఉండే జాతీయ రహదారులపై తెల్లగా మెరుస్తూ ఒక వాహనం మెల్లగా ముందుకు కదులుతూ ఉంటుంది… అది పోలీస్ కారు కాదు… రహదారుల నిర్వహణ ట్రక్కు కూడా కాదు… అంతకు మించిన ఒక అత్యాధునిక సాంకేతిక వాహనమది… దాని పైకప్పుపై అమర్చిన స్కానర్లు కంటికి కనిపించని కిరణాలను ప్రసరింపజేస్తాయి… హై రిజల్యూషన్ కెమెరాలు చప్పుడు చేయకుండా గిర్రున తిరుగుతుంటాయి… అధునాతన త్రీడీ లేజర్ సెన్సార్లు రోడ్డుపై ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తాయి… అదే నెట్‌వర్క్ సర్వే వెహికల్ (ఎన్ఎస్వీ).

లేజర్ ప్రొఫైలర్లు, జీపీఎస్, అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతలతో రూపుదిద్దుకున్న ఒక సరికొత్త ఆవిష్కరణ ఇది. రోడ్డుపై ఉన్న పగుళ్లు, గుంతలను, మిట్టపల్లాలను ఈ వెహికల్ క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది. తద్వారా రహదారులను స్పష్టమైన డిజిటల్ మ్యాపులుగా చిత్రీకరిస్తుంది. చూడడానికి సాధారణ విషయంగానే కనిపించినప్పటికీ, జాతీయ రహదారుల పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణలో భారత్ అనుసరించే విధానంలో నిజంగా ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ.

దేశంలోని నేషనల్ హైవేలపై ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక ముందడుగు వేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, రహదారి వ్యవస్థల్లో అధునాతన త్రీడీ లేజర్ ఆధారిత వ్యవస్థలతో కూడిన నెట్‌వర్క్ సర్వే వెహికళ్లను (ఎన్ఎస్వీ) మోహరిస్తున్నట్లు ప్రకటించింది.

సాఫీగా ప్రయాణం..
ఈ కార్యక్రమంతో రహదారుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. లోపాలను గుర్తించడమే కాకుండా వాటిని వేగంగా సరిదిద్దేలా వ్యవస్థ పనిచేస్తుంది. తద్వారా లక్షలాది ప్రయాణికులకు మరింత సురక్షితంగా, సాఫీగా ప్రయాణాన్ని అందిస్తుంది. ఒకప్పుడు నెలల సమయం పట్టిన పనులు ఇప్పుడు కొన్ని రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ఇది రహదారుల భద్రతను పెంచడంతోపాటు వేగవంతమైన మరమ్మతులకు, సంబంధిత వర్గాల మధ్య పారదర్శక సమాచార వినిమయానికి అవకాశాన్ని కల్పిస్తుంది.

హైవేలు స్కానింగ్
• త్రీడీ లేజర్ వ్యవస్థల వాహనాలతో రహదారుల సర్వే
• పగుళ్లు, గుంతలు గుర్తింపు.. ఫొటోలతో ఏఐ డేటా నివేదిక
• ఆ వెంటనే కేంద్రీకృత ఎన్ఎస్వీ కేంద్రానికి చేరవేత
• మరమ్మతులకు ప్రణాళికలు.. ప్రయాణ భద్రతకు భరోసా
• కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ విప్లవాత్మక నిర్ణయం

ఈ సాంకేతికత ద్వారా లోపాలను వేగంగా గుర్తించి క్షేత్రస్థాయిలోనే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోంది. రహదారుల భద్రతను పెంచడమే కాకుండా వేగవంతమైన మరమ్మతులు, పారదర్శక నిర్వహణకు ఇది దోహదపడుతోంది.

రోజుకు 300 కి.మీ సర్వే
గతంలో ఒక రోజులో 20 నుంచి 80 కిలోమీటర్ల మేర మాత్రమే సర్వేలు సాధ్యమయ్యేవి. కానీ నేడు ఈ అధునాతన సాంకేతికతతో కూడిన ఎన్ఎస్వీ రోజుకు 300 కిలోమీటర్ల వరకు సర్వే చేయగలదు. ఈ భారీ సామర్థ్య పెరుగుదల వల్ల రహదారులపై లోపాలను వేగంగా గుర్తించడమే కాకుండా క్షేత్రస్థాయిలోనూ వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

క్షేత్రస్థాయిలో సేకరించిన సర్వే డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి 48 గంటల్లోనే కేంద్రీకృత ఎన్ఎస్వీ కేంద్రానికి పంపిస్తారు. అయిదు జోన్లలో వ్యూహాత్మకంగా మోహరించిన నిపుణుల బృందాలు ఆ డేటాను క్రమపద్ధతిలో విశ్లేషిస్తాయి. 10 రోజుల్లోనే ఆ డేటాను క్షేత్రస్థాయిలో ఉపయోగపడే నివేదికలుగా మారుస్తారు.

ఏఐ ఆధారిత రహదారి పర్యవేక్షణ…
ఈ సరికొత్త ఎన్ఎస్వీ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారులపై సేకరించిన ప్రతి సమాచారం నేరుగా ఎన్‌హెచ్ఐఐకి చెందిన కృత్రిమ మేధ ఆధారిత డేటా లేక్ పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతుంది. దీంతో నిపుణుల బృందాలు ఆ నివేదికలను వేగంగా విశ్లేషించడానికీ, క్షేత్రస్థాయి ఆధారాలతో మరమ్మతులు, నిర్వహణ పనులను జాప్యం లేకుండా చేపట్టడానికీ వీలవుతుంది.

మరమ్మతులతో ప్రక్రియ సంపూర్ణం
కేవలం లోపాలను పర్యవేక్షించడంతోనే సరిపెట్టే పాత పద్ధతులకు భిన్నంగా ఈ సరికొత్త ఎన్ఎస్వీ విధానంలో ప్రతి లోపాన్ని పూర్తిగా సరిదిద్దిన తర్వాతే ప్రక్రియ ముగుస్తుంది. నివేదికలో నమోదైన ప్రతి సమస్య వంద శాతం పరిష్కారమయ్యే వరకు రహదారుల నిర్వహణ సంస్థలదే పూర్తి బాధ్యత. ఇది కేవలం సాంకేతిక ఆధునికీకరణ మాత్రమే కాకుండా జవాబుదారీతనం, డిజిటల్ పాలన, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల నిర్వహణ దిశగా ఒక కీలక ముందడుగు. ఎన్ఎస్వీల నిఘాతో నేషనల్ హైవేలు మరింత సురక్షితంగా మారనున్నాయి.