ప్రపంచానికి యోగ నేర్పింది భారతదేశం..
ప్రపంచానికి యోగ నేర్పింది భారతదేశం..
మచిలీపట్నంలో యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమం
ఆరోగ్యం కోసం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి – గురునాథ్ బాబు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆంధ్ర యోగ సభ గురూజీ గురునాథ్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కాస్మోపాలిటీ క్లబ్ ఆవరణలో మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ మరియు కాస్మోపాలిటన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
“మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది” అన్నదానికి యోగ ఉత్తమ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజులు యోగా సాధన చేస్తే రోగాలకు దూరంగా ఉండటంతో పాటు పాజిటివ్ జీవనశైలి అలవడుతుందని తెలిపారు. సూర్యాస్తమయం సమయానికి రాత్రి భోజనం ముగించుకోవడం ద్వారా శరీర ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ జిల్లావ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విశ్రాంత అదనపు ఎస్పీ శాయన సుశీలరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, మాజీ జడ్పీటీసీ సభ్యులు అంబటి కాంతారావు, నవకళ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించగా, మహిళలు వివిధ యోగా భంగిమలను ప్రదర్శించారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు.
విశ్రాంత అదనపు ఎస్పీ శాయన సుశీలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సంపూర్ణ ఆరోగ్యమే గొప్ప సంపద అని అన్నారు. రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు.
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు సానుకూల ఆలోచన శక్తి పెరుగుతుందని తెలిపారు. రాబోయే తరానికి యోగాను అందించాల్సిన బాధ్యత నేటి తరం పై ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి బీ.ఎస్.వి. రమేష్, హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు, యోగా టీచర్లు లక్ష్మీ రాజ్ కుమార్, స్వర్ణలత, లీలారాణి, చింతయ్య మాస్టారు, కాస్మోపాలిటన్ క్లబ్ ప్రతినిధులు పరుచూరి బాబు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
