వాంబే కాలనీలో రూ.75 లక్షల కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కేటాయించిన రూ.75 లక్షలతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పేద క్రైస్తవ సోదరులు, బడుగు బలహీన వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోస్టర్స్ అసోసియేషన్ వినతికి స్పందిస్తూ ఈ నిధులు కేటాయించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
ఈ నిధులతో నిర్మించబడే క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి వస్తే, స్థానిక ప్రజలు తమ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రార్థనలు తక్కువ ఖర్చుతో నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ సమన్వయంతో కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో నిధుల కొరత లేకుండా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు చేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వారు పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గ, టీడీపీ సీనియర్ నాయకుడు నవనీతం సాంబశివరావు, క్లస్టర్ ఇంచార్జి కంచి ధనశేఖర్, డివిజన్ ప్రెసిడెంట్ బెవర సూరి, నాగరాజు, పోస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గాబ్రియేల్, రత్నబాబు, ఆదిబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
