ఘనంగా ఉచిత సామూహిక ఉపనయనాలు..

ఘనంగా ఉచిత సామూహిక ఉపనయనాలు..

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రధాన అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్ హాజరు..
పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సత్యనారాయణపురం ప్రాంతంలోని శ్రీ జగద్గురు శృంగేరి పాదుకా క్షేత్రానికి అనుబంధంగా, శివాజీ కేప్ సెంటర్ సమీపంలోని రోటరీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు భక్తి వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లాది విష్ణు వర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై ఉపనయనములు పొందుతున్న బాలురకు ఆశీర్వాదాలు అందించారు.

సంప్రదాయ పద్ధతుల్లో వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతను ప్రతిబింబించింది. బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పువరపు వెంకట బలరామకృష్ణమూర్తి, మారుతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సేవకు నిదర్శనంగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపనయన సంస్కారం నిర్వహించడం ద్వారా సంఘం తమ సేవా దృక్పథాన్ని చాటుకుంది.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చాంద్, స్థానిక డివిజన్ వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సాంప్రదాయ విలువలను పరిరక్షిస్తూ సామూహికంగా ఉపనయనాలు నిర్వహించడం సమాజంలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.