ఉద్యమకారులకు మాజీ ఎమ్మెల్యే చెప్పాలి క్షమాపణ చెప్పాలి..

చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, అలాగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ వేముల వీరేశం పై చేసిన వ్యాఖ్యలను మలిదశ తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు,కాటం వెంకటేష్ మాట్లాడుతూ, ఉద్యమకారులను అణచివేసిన వ్యక్తులు ఇప్పుడు ఉద్యమ చరిత్రపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేసినందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములకు ప్రభుత్వ విప్ పదవి అప్పగించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నకిరేకల్ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ ఉద్యమ కాలంలో రైలు రోకోలు, రాస్తారోకోలు, ధర్నాలు, జైలు పోరాటాలు చేసిన ఉద్యమకారులపై కేసులు పెట్టించి లాఠీచార్జీలు చేయించిన చరిత్ర చిరుమర్తి ది అని ఆరోపించారు.

సూర్యాపేట, నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూర్ ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల్లో ఉద్యమకారులపై జరిగిన దాడులను ప్రజలు మర్చిపోలేదన్నారు. వేముల వీరేశం, వేముల పుష్పక్క తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ గొంతుకలని, మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం లింగయ్య అసలు స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.ఈ సమావేశంలో కోనేటి యాదగిరి,గోపగోని లింగస్వామి,గుసు శ్రీనివాస్,జవాజి శేఖర్, బెల్లి సత్తయ్య,ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.