శవాలను బైక్‌కి కట్టి సముద్రంలో పడేసి.. మచిలీపట్నం కేసులో షాకింగ్ ట్విస్ట్!

  • జంట హత్యలను ఛేదించిన పోలీసులు
  • సముద్రపు వేటలో వివాదాలే ప్రధాన కారణం
  • కర్కశంగా చంపి.. ఆపై తాడుతో కట్టి.. సముద్రంలో పడేసిన వైనం

మచిలీపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ‌ : అన్నం పెట్టి , పెంచి పోషిస్తున్న సముద్రపు వేట వారి పాలిట శాపంగా మారింది. జీవించడానికి నమ్ముకున్న సముద్రంలోనే.. వారి జీవితాలు కలిసిపోయాయి. కష్టపడి, ఇష్టపడి సముద్రపు వేటనే నమ్ముకున్న ఆ మామ, అల్లుళ్లు నడి సముద్రంలోనే.. తమ జీవితాలు ముగిసిపోతాయని ఎప్పటికీ ఊహించి ఉండరు. సముద్రపు వేటలో వచ్చిన చిన్న చిన్న ఘర్షణలే.. రెండు ప్రాణాలను బలి తీసుకుని రెండు నిండు జీవితాలను వీధిన పడేసింది. కుటుంబాలకు ఆధారమైన ఇద్దరు వ్యక్తులు లేకపోవడంతో ఆ ఇంట్లో చీకట్లో కమ్ముకుని, నేటికీ హృదయవిదారక దృశ్యాలు స్థానికులను కలచి వేస్తున్నాయి. గ్రామంలో అందరితో మంచిగా ఉంటూ… తన పని తాను చేసుకునే… శెట్టి సుబ్బయ్య, అల్లుడు అయ్యప్పలను చిన్న చిన్న ఘర్షణల మాటున కర్కశంగా బలి తీసుకుని.. మండలంలో సంచలన హత్యలకు.. కేంద్ర బిందువయ్యారు. ఈ కేసుకు సంబంధించి.. పూర్వాపరాలను మచిలీపట్నం డీఎస్పీ జి. శ్రీనివాసరావు విలేకరులకు తెలియజేశారు.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. హత్యకు గురికాబడిన శెట్టి సుబ్బయ్యకు, అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుతో చాపల వేటకు సంబంధించి హత్య జరిగిన నెల రోజుల క్రితం చిన్నపాటి ఘర్షణలు తలెత్తాయి. అవి మనసులో పెట్టుకున్న శంకరపు శీను, అతడి స్నేహితుడు జల్లా శ్రీనుతో కలిసి శెట్టి సుబ్బయ్య, గొలుసు అయ్యప్పల హత్యకు పథకాన్ని రచించారు. వీరిద్దరికీ పాత పరిచయం ఉన్న గుడివాడకు చెందిన కళ్యాణ్, శ్రీకాంత్, అబ్దుల్ ఖాదర్ జిలాని, విజయరత్నంలతో హత్యకు పథకాన్ని రచించి సముద్రపు వేటకు వెళ్లి వస్తున్న సుబ్బయ్య, అయ్యప్పలను దారుణంగా చంపారు. చంపిన వీరి ఇరువురి శవాలను వారి బైకుకు తాడుతో కట్టి సముద్రంలో పడేశారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు..

అయితే సంచలన హత్యగా మారిన ఈ కేసులు ఛేదించడంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. కొన్ని రోజులపాటు అన్ని రకాలుగా జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ ఫోన్ల ఆధారంగా కేసులు చేదించడంలో కృష్ణాజిల్లా పోలీసులు విజయం సాధించారు. ఈ కేసు ఛేద‌న‌లో సహకరించిన పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు, దర్యాప్తులో పాల్గొన్న కంకిపాడు సిఐ బీబీ రవికుమార్, సీఐ ఏసుబాబు, గూడూరు ఎస్ఐ ప్రకాష్, స్థానిక పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.