నునసారాళ్లలో మామిడి తోటల పరిశీలన

నునసారాళ్లలో మామిడి తోటల పరిశీలన
మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ విమర్శ
తుగ్గలి, ఆంధ్రప్రభ : మండలం పరిధిలోనే నునసారాళ్ల గ్రామములో రైతులు సాగుచేసిన మామిడి తోటలను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తోటల్లో పండిన మామిడి పంటకు సరైన ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు.
మామిడి పంట సాగు కోసం రైతులు భారీగా పెట్టుబడులు పెట్టినా ప్రస్తుతం మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక నష్టాలు చవిచూస్తున్నారని రైతులు మాజీ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు పెరిగిపోయినా దిగుబడికి తగిన ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మామిడి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు సరైన మార్కెట్ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రస్తుతం వ్యాపారులు మరియు మధ్యవర్తులు రైతులను దోచుకుంటున్నారని, ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆమె ఆరోపించారు. మామిడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నేరుగా లాభం చేకూరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీదేవమ్మ హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పరశురాం రెడ్డి, వైఎస్ఆర్సిపి డాక్టర్స్ విభాగపు జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ రంగారెడ్డి, వైసిపి మండల కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, వైసిపి రైతు విభాగపు మండల సెక్రెటరీ రమణారెడ్డి వైసీపీ నాయకుడు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు వైసిపి సీనియర్ నాయకులు తుగ్గలి శ్రీనివాస్ రెడ్డి ,ఎర్రగుడి రామచంద్రారెడ్డి, రాతనమోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, తుగ్గలి మోహన్ రెడ్డి, తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి, జిట్టా నగేష్ యాదవ్, పెండేకల్ గోపాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నాగభూషణం రెడ్డి, రామ్ కొండ సుధాకర్ రెడ్డి, ముక్కెళ్ల లక్ష్మణస్వామి, పత్తికొండ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
