తిరుమలగిరి జడ్పీ పాఠశాలకు 150 అడ్మిషన్లు
తిరుమలగిరి, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2026–27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే 150 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడంతో ఈ ఫలితం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. 150 మంది విద్యార్థులు చేరిన సందర్భంగా వారితో ‘150’ ఆకారాన్ని రూపొందించి పాఠశాలలో పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహించారు.
జిల్లాలో అత్యధిక అడ్మిషన్లు నమోదు చేసిన ప్రభుత్వ పాఠశాలగా తిరుమలగిరి జడ్పీ ఉన్నత పాఠశాల నిలిచిందని ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే 200కు పైగా అడ్మిషన్లు సాధించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో పాఠశాలలో 500 మంది విద్యార్థులతో ప్రార్థన నిర్వహించే స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
