భవనంపై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టేకులబస్తీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడడంతో సెంట్రింగ్ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాము సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం భార్యతో కలిసి బెల్లంపల్లిలోని తన బావమరిది ఇంటికి వచ్చాడు. బావమరిది నిర్మిస్తున్న ఇంటి స్లాబ్ పనులు పూర్తయ్యాక ఉక్కపోతగా ఉండటంతో కొత్త ఇంటి స్లాబ్‌పై నిద్రించేందుకు వెళ్లాడు.

అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసం నిద్రలేచిన సమయంలో ప్రమాదవశాత్తు స్లాబ్‌పై నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏఎస్సై వేణుగోపాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, స్వగ్రామమైన గొల్లపల్లికి తరలించారు.