Tiger Conservation | పులుల సంరక్షణపై చర్చ
Tiger Conservation | పులుల సంరక్షణపై చర్చ
ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Tiger Conservation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ ముంబైలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.
తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య తగ్గిపోవడంతో అంతరసంతానోత్పత్తి (ఇన్‌బ్రీడింగ్) సమస్యలు తలెత్తుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు మహారాష్ట్ర నుంచి రెండు ఆడపులులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు.

ఈ నిర్ణయం తూర్పు కనుమల్లో పులుల జన్యు వైవిధ్యాన్ని పెంచడంతో పాటు, ఆరోగ్యకరమైన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పాటుకు దోహదపడుతుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది పులుల సంరక్షణ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జీవ వైవిధ్య పరిరక్షణలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు, అలాగే కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.


