పెండింగ్ బిల్లులతో మంగపేటలో ఇసుక లోడింగ్ బంద్
మంగపేట, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక క్వారీలను నిర్వహిస్తున్న గిరిజన సొసైటీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని మూడు ఇసుక రీచ్‌ల వద్ద లోడింగ్ నిలిపివేశారు. పెండింగ్ బకాయిలు అందకపోవడంతో పాటు డీజిల్ ధరలు పెరగడం వల్ల డ్రైవర్లు, సూపర్‌వైజర్లకు జీతాలు చెల్లించడమే కాకుండా క్వారీల నిర్వహణ కూడా భారంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బంద్‌ను కొనసాగిస్తూ ఇసుక లోడింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తామని ఇసుక రీచ్ నిర్వాహకులు హెచ్చరించారు. ఈ విషయాన్ని టీజీఎండీసీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.
