ఎస్‌ఐఆర్‌కు అఖిలపక్షం సహకరించాలి: తహసీల్దార్
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహకారం అందించాలని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్ కోరారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్‌వోలు ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన దరఖాస్తులు, ధ్రువపత్రాలు సకాలంలో సమర్పించేలా సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే సంబంధిత అధికారులు, బీఎల్‌వోలు లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్‌ఐ కృష్ణారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
