భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మారై సేవల ప్రారంభం
వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.12.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై యంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎమ్మారై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. దీంతో క్లిష్ట వైద్య పరీక్షల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే నాణ్యమైన ఎమ్మారై పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని, ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. వెంకటరత్నం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు బట్ట కరుణాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
