Explosions | ఫార్మ ఫ్యాక్టరీలలో వరుస అగ్నిప్రమాదాలు..

Explosions | ఫార్మ ఫ్యాక్టరీలలో వరుస అగ్నిప్రమాదాలు..

Explosions | నిబంధనల ఉల్లంఘనతో పెరుగుతున్న ప్రమాదాలు
రియాక్టర్లు, బాయిలర్ల పేలుళ్ల వెనుక కారణాలు
నాసిరకం పరికరాలు, షార్ట్ సర్క్యూట్ల భయం
శిక్షణ లేని కార్మికులతో ప్రమాదాల పెరుగుదల
అధికారుల పర్యవేక్షణలో లోపాలు
అధిక ఉత్పత్తి ఒత్తిడి – ప్రమాదాలకు కారణం
కఠిన చర్యలే పరిష్కారం

Explosions | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పొట్టకూటి కోసం పనికి వెళ్లిన కార్మికుడు.. ప్రాణలతో తిరిగి వస్తాడో రాడో తెలియని పరిస్థితి. అందరికీ ప్రాణదాతలుగా నిలవాల్సిన ఫార్మ కంపెనీలే.. ఇప్పుడు కార్మికుల పాలిటి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. పారిశ్రామిక వాడల్లోని ఫార్మా, కెమికల్ కంపెనీల్లో తరచూ అగ్నిప్రమాదాలు, రియాక్టర్ల పేలుళ్లు సంభవించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పటాన్ చెరు.. నిన్న చౌటుప్పల్.. నేడు జిన్నారంలో.. ఈ అగ్నిప్రమాదాలతో కార్మికుల బతుకులు బుడిద అవుతున్నాయి.

నిబంధనల ఉల్లంఘన..

చాలా ఫార్మా కంపెనీలు కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉండాల్సిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఆటోమేటిక్ ఫైర్ అలారాలు, వాటర్ స్ప్రింక్లర్లు సరిపడా ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా, అవి ఎప్పుడూ పనిచేసే స్థితిలో కనిపించడం లేదు.

రియాక్టర్లు, బాయిలర్ల పేలుళ్లు..

ఫార్మా పరిశ్రమల్లో మందుల తయారీకి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తారు. వీటిని రియాక్టర్లలో ప్రాసెస్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత, ఒత్తిడి నిరంతరం గమనించాలి. పాతబడిపోయిన రియాక్టర్లు, బాయిలర్లను మార్చకుండా అలాగే వాడటం. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి.

షార్ట్ సర్క్యూట్లు, నాసిరకం పరికరాలు..

అత్యంత మండే స్వభావం ఉన్న రసాయనాలు, వాయువులు ఉండే ప్రదేశాల్లో నాసిరకం ఎలక్ట్రికల్ వైరింగ్ వాడటం వల్లే తరచూ షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. చిన్న నిప్పురవ్వ పడినా అది క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపిస్తుంది.

శిక్షణ లేని కార్మికులు..

ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేసేటప్పుడు కార్మికులకు పూర్తి స్థాయిలో భద్రతా శిక్షణ ఇవ్వాలి. కానీ, యాజమాన్యాలు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ జీతానికి నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను, వలస కూలీలను విధుల్లోకి తీసుకుంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో వారికి తెలియకపోవడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది.

అధికారుల పర్యవేక్షణ లోపం..

ఫ్యాక్టరీల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు నామమాత్రంగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సేఫ్టీ ఆడిట్‌లు సరిగ్గా జరగకపోవడం వల్లే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

సామర్థ్యానికి మించిన ఉత్పత్తి..

ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చిన సామర్థ్యం కంటే, అధిక లాభాల కోసం ఎక్కువ ఉత్పత్తి చేస్తుంటారు. దీంతో యంత్రాలపై, కూలీలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి ప్రమాదాలకు దారితీస్తోంది.

ఈ వరుస ప్రమాదాలను నివారించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే కార్మికుల ప్రాణాలకు రక్షణ ఉంటుంది.

Leave a Reply