పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి స్వనిధి పథకం విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీధి వ్యాపారులు, లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం చిన్న వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించిందన్నారు. వీధి వ్యాపారులకు సులభ రుణ సదుపాయాలు అందించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

చిన్న వ్యాపారులు ఆత్మనిర్భరంగా ఎదగడానికి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కూలీ పని ఒక రోజు జీవనానికి, ఉద్యోగం ఒక నెల జీవనానికి ఉపయోగపడితే, వ్యాపారం మాత్రం జీవితాంతం కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యాపారం ద్వారా కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు పిల్లలకు ఉన్నత విద్య అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. యువత, చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను అనవసర ఖర్చులకు వినియోగించకుండా ఆదాయం పెంచే వ్యాపారాల కోసం ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపులు, పాడి పరిశ్రమలు వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదగవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించిన ఆయన, పీఎం స్వనిధి పథకం అమలులో విశేషంగా కృషి చేస్తున్న మెప్మా అధికారులను అభినందించారు.