పర్యావరణ పరిరక్షణకు వేదాలే మార్గదర్శకం
పర్యావరణ పరిరక్షణకు వేదాలే మార్గదర్శకం
బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమానికి ప్రజల మద్దతు కోరిన బీజేపీ
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల తాటి చెట్ల నాటే మహా ఉద్యమం
కోనోకార్పస్ నిషేధం, పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ‘అమ్మ పేరు మీద ఒక మొక్క’ నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం ఉద్యమంగా స్వీకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాధవ్, భారతీయ సంస్కృతి, వేదాలు ప్రకృతి సంరక్షణకు వేల ఏళ్ల క్రితమే మార్గనిర్దేశం చేశాయని పేర్కొన్నారు.

ఇంట్లో ఒక శిశువు జన్మించినప్పుడు ఆ జీవికి అవసరమైన ఆక్సిజన్ కోసం మూడు మొక్కలు నాటాలని వేదాలు సూచించాయని తెలిపారు. అధర్వణ వేదంలోని ‘పృథ్వీ సూక్తం’ భూమి పరిరక్షణ, వృక్ష సంపద ప్రాధాన్యాన్ని విశదీకరిస్తుందని చెప్పారు. రావి, తులసి వంటి దేవతా వృక్షాలు పర్యావరణ సమతుల్యతకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. పర్యావరణానికి హానికరంగా మారుతున్న విదేశీ జాతి మొక్క కోనోకార్పస్ సాగును రాష్ట్రంలో నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆయన, ఈ మొక్కల వల్ల భూగర్భ జలాలు, స్థానిక జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 10 లక్షల తాటి చెట్ల నాటే మహా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి తడ వరకు సముద్ర తీరాలు, నదీ తీరాలు, చెరువుల గట్ల వెంట భారీ స్థాయిలో తాటి మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో లక్ష తాటి టెంకలను సేకరించి పచ్చదన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. తాటి చెట్టును రాష్ట్ర వృక్షంగా ప్రకటించడంతో పాటు తాటి ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రత్యేక పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని, తాటి చెట్లను నరికివేతను నేరంగా పరిగణించేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పనతాల సురేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
