ఆరోగ్యకరమైన ప్రాంగణాలుగా గురుకుల పాఠశాలలు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ఆరోగ్యకరమైన ప్రాంగణాలుగా గురుకుల పాఠశాలలు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
‘అనంత అరణ్య వనం’ కార్యక్రమం ప్రారంభం
గురుకులాలను ‘నెట్-జీరో’ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
చల్లపల్లి, ఆంధ్రప్రభ: గురుకుల పాఠశాలలను ఆరోగ్యకరమైన ప్రాంగణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘అనంత అరణ్య వనం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చల్లపల్లి నారాయణరావు నగర్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో రూ.5 లక్షల వ్యయంతో 25 సెంట్లలో 1,625 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరి మొక్కలు నాటి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలల సరిహద్దు గోడ లోపల బహుళ వరుసల మొక్కల వలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా గాలి నాణ్యతను పెంచి, దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు. పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, నీడనిచ్చే మొక్కలను నాటి గురుకులాల ఆవరణను అందంగా మార్చడమే కాకుండా.. గాలిలో ఆక్సిజన్ పెంచి, కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.
దీనితో పాటు వ్యర్థాల నిర్వహణ, సౌరశక్తి, నీటి పునర్వినియోగ కార్యక్రమాలను చేపట్టి గురుకులాలను ‘నెట్-జీరో’ స్కూళ్లుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరోగ్యకరమైన పచ్చని పాఠశాల ప్రాంగణాలను సృష్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఎంపీడీఓ ఏఏ ఆనందకుమారి, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు పాల్గొన్నారు. అలాగే ఏపీఎస్ఐడీసీ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, సహకార సంఘ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, ఏజీపీ తుటారం ప్రసాద్, పార్టీ నాయకులు గుడివాక శివరావు, మాచవరపు ఆదినారాయణ, చందన రంగారావు, రాయవరపు నాంచారయ్య, ఇంచార్జి ఏపీఓ కేవీజీ కిరణ్ కుమార్, ఎఫ్ఏ బండి శరత్, గురుకుల ఉపాధ్యాయినులు, మరియు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
