కొలికపూడి సైకిల్ సవారి

కొలికపూడి సైకిల్ సవారి

సైకిల్‌పై ఆర్‌డీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే కొలికపూడి
‘నో వెహికల్ డే’తో పర్యావరణ పరిరక్షణకు సందేశం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కల నాటిన ఎమ్మెల్యే.
ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించి అధికారులకు సూచనలు..

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం

తిరువూరు, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన ‘నో వెహికల్ డే’లో భాగంగా ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి తిరువూరు ఆర్‌డీఓ కార్యాలయం వరకు సైకిల్‌పై ప్రయాణించి ప్రజలకు పర్యావరణ హిత జీవన విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సంపదను కాపాడడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలతో కలిసి పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను పరిరక్షించడం, పరిశుభ్రమైన పరిసరాలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే వివరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. భూ వివాదాలు, రెవెన్యూ అంశాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకొని వేగవంతంగా పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ప్రతి వినతిపై అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ ఏ. కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువతతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply