చల్లపల్లిలో ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

చల్లపల్లి, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను చల్లపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు.

చల్లపల్లి పడమర వీధిలోని వంగవీటి మోహనరంగా విగ్రహానికి చల్లపల్లి పీఏసీఎస్ చైర్మన్, జనసేన టౌన్ అధ్యక్షుడు బొందలపాటి వీరబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు అడపా రవి, టీడీపీ నేత రావి రాజేశ్వరరావు, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వంగవీటి మోహనరంగా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సోమిశెట్టి రాఘవేంద్రరావు, రామిశెట్టి కృష్ణ, కొప్పినేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.