ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ వేగవంతం చేయాలి

ఫారాలను బీఎల్‌వోలే పంపిణీ చేయాలి..

రాజకీయ ప్రతినిధులను భాగస్వామ్యం చేయొద్దు: కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని నూరుశాతం పూర్తి చేసి, డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎన్యూమరేషన్ సిబ్బందిని ఆదేశించారు.

శనివారం పెదవేగి మండలంలోని పెదవేగి గ్రామంలో బీఎల్‌వోలు చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో బీఎల్‌వోలు, సూపర్వైజర్లతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 15,79,042 (96.04 శాతం) ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. వాటిలో 3,30,537 (20 శాతం) ఫారాలను డిజిటైజేషన్ చేసినట్లు వెల్లడించారు.

పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.42 శాతం మాత్రమే పూర్తైందని, అదే రోజు సాయంత్రంలోగా నూరుశాతం పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జూలై 14, 2026 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రతి బూత్ లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారాలను అందజేసి, ఓటర్లు పూర్తిచేసిన అనంతరం వాటిని తిరిగి సేకరించి డిజిటైజేషన్ చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడం, అనర్హుల పేర్లు చేరకుండా నిరోధించడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాల సవరణ, డూప్లికేట్ పేర్ల తొలగింపు, కొత్త అర్హుల నమోదు చేపడతామని తెలిపారు.

బీఎల్‌వోలు రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాలని, ఎన్యూమరేషన్ ఫారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. బీఎల్‌వోలే ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలను అందించి, పూర్తిచేసిన తర్వాత తిరిగి సేకరించి డిజిటైజేషన్ చేయాలని ఆదేశించారు.

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్‌లో వెనుకబడిన సిబ్బందిపై చర్యలకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ సి.హెచ్. హేమ ప్రసాద్, ఎంపీడీఓ ఎం. నాగేంద్ర కుమార్, బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.