విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ రైతు పొలంలో బోరు మోటర్ ను రిపేర్ చేసేందుకు వెళ్ళిన లక్ష్మన్న (36) అనే ఎలక్ట్రిషియన్ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్ అయిన లక్ష్మన్న పనిలో భాగంగా బోరు మోటార్‌ను బాగు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఊహించని ఈ ఘటనతో గార్లదిన్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుడు లక్ష్మన్నకు భార్య చిట్టమ్మతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
కుటుంబానికి ఆధారం అయిన లక్ష్మన్న అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, పిల్లల భవిష్యత్తుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య చిట్టమ్మ రోదనలు మిన్నంటాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ఈ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
