ఆదోనిలో ఉద్రిక్తత…

ఆదోనిలో ఉద్రిక్తత…
టవర్ ఎక్కిన యువకుడు
ఆదోని, ఆంధ్రప్రభ : భార్యను కాపురానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు టీవీ టవర్ ఎక్కి హంగామా చేసిన ఘటన ఆదోనిలో ఉద్రిక్తతకు దారితీసింది. చిప్పగిరి మండలం నేమ్మకల్లు గ్రామానికి చెందిన సురేంద్ర కుటుంబ కలహాల నేపథ్యంలో పట్టణంలోని పాత బ్రిడ్జి సమీపంలో ఉన్న టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
టవర్ పై ఉన్న యువకుడితో ఫోన్ ద్వారా మాట్లాడిన పోలీసులు అతడిని సమాధానపరచేందుకు ప్రయత్నించారు. కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తామని హామీ ఇస్తూ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో కొంతసేపటి తరువాత యువకుడు దిగేందుకు అంగీకరించగా, సురక్షితంగా కిందకు దింపారు. ఈ ఘటనతో అక్కడికి చేరుకున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు సమయోచితంగా స్పందించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
