Delhi | పట్టుపడితే ఇద్దరికీ నష్టమే : కేంద్ర హోంశాఖ

విభజన సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలి

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారులు సమావేశమయ్యారు. ఇటీవ‌ల‌ హోంశాఖ కార్య‌ద‌ర్శిగా బాధ్యతలు చేపట్టిన గోవింద్ మోహన్… తొలిసారిగా ఏపీ, తెలంగాణ విభజన చట్టాన్ని సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల బదలాయింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

దాదాపు రెండేళ్ల తర్వాత విభజన చట్టం అమలుపై హోంశాఖ లోతుగా సమీక్షించింది. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని హోంశాఖ సూచించింది. రెండు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతు ఇస్తామని హోంశాఖ తెలిపింది. నిధుల పంపకాల్లో సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని హోంశాఖ తెలిపింది

ఎక్కువ వాటా కోసం పట్టుపడితే ఇద్దరికీ నష్టమేనని కేంద్ర కార్యదర్శి చెప్పినట్లు తెలిసింది. కోర్టుకు వెళితే తామేమీ చేయలేమని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు స‌మాచారం.

అయితే, 9, 10 షెడ్యూలోని సంస్థ‌ల‌ విషయంలో న్యాయ సలహా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ కార్యదర్శి చెప్పినట్లు తెలిసింది.

Leave a Reply