ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
- ఆగస్టు 30వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అవకాశం
- పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పన
- డీఆర్ఓ మోహన్ కుమార్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రత్యేక విస్తృత సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు.
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో జిల్లాలోని మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 12,04,067 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన అర్హులైన ఓటర్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు ప్రజల భాగస్వామ్యంతో పాటు రాజకీయ పార్టీల సహకారం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఎన్నికల యంత్రాంగం, రాజకీయ పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటిపై సెప్టెంబర్ 28లోపు విచారణ పూర్తిచేసి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.
ముసాయిదా జాబితాలను అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవల్ అధికారుల వద్ద, ఓటర్ల నమోదు అధికారుల కార్యాలయాల్లో, సహాయ ఓటర్ల నమోదు అధికారులు, తహశీల్దార్ల కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 1,36,059 మంది పేర్లను అన్‌ట్రేసబుల్ గా గుర్తించి ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. అలాగే గడువు ముగిసే నాటికి మ్యాపింగ్ పూర్తి చేయని 23,881 మంది ఓటర్లకు శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.
ఎన్యూమరేషన్ ఫారాల్లో తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తార్కిక దోషాలు ఉన్న 1,10,205 మంది ఓటర్లకు కూడా నోటీసులు అందజేస్తామని తెలిపారు. మొత్తం 11 రకాల లోపాలకు సంబంధించి సంబంధిత ఓటర్లు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకోసం బూత్ లెవల్ అధికారులు నాలుగోసారి ఇంటింటికి వెళ్లి పత్రాలు స్వీకరిస్తారని వివరించారు.
కొత్తగా ఓటరు పేరును నమోదు చేసుకోవడానికి ఫారం-6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం-7, వివరాల సవరణలు లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరొకదానికి పేరు మార్పు కోసం ఫారం-8 ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే బల్క్ రూపంలో ఫారాలను ఇవ్వడం లేదా స్వీకరించడం ఉండదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు నిర్ణీత గడువులో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి విచారణ పూర్తి చేస్తారని, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా సహకరించాలని కోరారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకుని, అవసరమైన మార్పులు ఉంటే ఫారం-6, 7, 8 ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి బి. లోకనాథం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వి. సురేంద్ర కుమార్, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి విజయసింహారెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
