15-Crore-Works : ఆ పనులొద్దు Andhra Prabha Top Story
15-Crore-Works : ఆ పనులొద్దు Andhra Prabha Top Story
- జెడ్పీ సీఈవోలకు ఆదేశం
- రూ.15 కోట్ల పనుల రద్దు !?
- వీటిల్లో సిమెంట్ రోడ్లే అధికం
- పాత పనులు రద్దు వద్దు : జడ్పీ తీర్మానం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
15-Crore-Works : చిత్తూరు జిల్లా పరిషత్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరైన సుమారు రూ.15 కోట్ల విలువైన పనులు రద్దయ్యే పరిస్థితి నెలకొనడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ సీఈఓలకు మౌఖికంగా సూచించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు మంజూరై, పరిపాలనా అనుమతులు పొందిన పనుల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులే అత్యధికంగా రద్దు జాబితాలో ఉండడం స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళనకు దారితీసింది. మరో నెల రోజుల్లో జడ్పిటిసి సభ్యుల పదవీకాలం ముగియనుండడం, వారు ప్రతిపాదించిన పనులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సభ్యులలో ఆవేదన వ్యక్తం అవుతోంది.

జిల్లా పరిషత్ పరిధిలో ఈ ఏడాది వివిధ పథకాల కింద భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 3,228 పనులకు రూ.322 కోట్లకు పైగా, 368 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు రూ.89 కోట్లు, 501 గ్రామపంచాయతీ భవనాలకు రూ.16 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 24 గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రూ.150 కోట్లు, నాబార్డు నిధులతో 46 పనులకు రూ.68 కోట్లు కేటాయించింది. మొత్తంగా 3,647 అభివృద్ధి పనులు మంజూరుకాగా, వాటిలో 1,576 పనులు పూర్తయ్యాయి, 570 పనులు కొనసాగుతున్నాయి, 1,498 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రారంభం కాని ఈ 1,498 పనుల్లో 1,365 సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులు ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం వీటిని రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దు జాబితాలో గ్రామపంచాయతీ భవనాలు, నాబార్డు పనులు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు కూడా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, పలువురు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదించిన పనులను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పరిపాలనా అనుమతులు పొంది అమలుకు సిద్ధంగా ఉన్న పనులను నిలిపివేయకుండా, నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌కు రావలసిన నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం కింద రావలసిన రూ.15 కోట్ల నిధులు ఇప్పటికీ విడుదల కాలేదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని జిల్లా పరిషత్‌లకు బదిలీ చేయడం లేదన్నారు. అలాగే 16వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు కూడా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. అదనంగా సీఎంఆర్ఎఫ్ పరిధిలో రూ.10 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉందని వివరించారు.

మొత్తంగా రూ.25 కోట్లకు పైగా నిధులు జిల్లా పరిషత్‌కు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రద్దు చేయాలని భావిస్తున్న పనుల విలువ కేవలం రూ.15 కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేస్తే ఈ పనులన్నింటినీ కొనసాగించడమే కాకుండా జిల్లా పరిషత్ వద్ద మరో రూ.10 కోట్ల మేర మిగులు నిధులు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. నిధుల కొరత పేరుతో అభివృద్ధి పనులను రద్దు చేయడం సమంజసం కాదని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా స్పందించి, ప్రారంభం కాని పనులను రద్దు చేయకుండా వెంటనే నిధులు విడుదల చేసి అమలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించాలని కూడా నిర్ణయించారు. జిల్లా పరిషత్‌కు స్వంత ఆదాయ వనరులు పరిమితంగానే ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపైనే అభివృద్ధి కార్యక్రమాలు ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ సర్‌చార్జ్, సీనరేజ్ ఫీజు, ఇతర గ్రాంట్ల ద్వారా వచ్చే నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంజూరైన పనులను రద్దు చేస్తే గ్రామీణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.
