మొక్కలు విరివిగా నాటుదాం..
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
వర్షాకాలంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని నారాయణపేట జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.
శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రై డే–ఫ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వనమహోత్సవ ర్యాలీని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటడంతో పాటు, వాటికి క్రమం తప్పకుండా నీరు అందించి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో గ్రామాలు, పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని సూచించారు.
ఎంపీడీవో కార్యాలయం తనిఖీ
అంతకుముందు ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన సీఈవో వివిధ రికార్డులను పరిశీలించి ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ, కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో పరిపాలనా పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన శ్రీనివాసరావు, త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ నియామకానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలి
అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన సీఈవో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. వంటశాల, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పావని, ఎంఈవో మాధవి, డాక్టర్ సంతోషి, సూపరింటెండెంట్ పార్వతమ్మ, సీనియర్ అసిస్టెంట్ విద్యారాణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
