ఎక్సైజ్ దాడుల్లో నల్లబెల్లం, పటిక స్వాధీనం

గుడుంబా తయారీకి వినియోగించే 725 కిలోల సామగ్రి పట్టివేత.. కిరాణా దుకాణ యజమానిపై కేసు

పెద్దవంగర, ఆంధ్రప్రభ : నిషేధిత గుడుంబా తయారీలో వినియోగించే నల్లబెల్లం, పటిక, చక్కెరను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని తొర్రూరు ఎక్సైజ్ సీఐ బూస అశోక్ వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 325 కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటిక, 200 కిలోల చక్కెరను స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత గుడుంబా తయారీకి వినియోగించే ఈ సామగ్రిని స్వాధీనం చేసుకుని దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బూస అశోక్ తెలిపారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై శంకర్‌తో పాటు సిబ్బంది సంపత్, రవీందర్, శశివర్ధన్ పాల్గొన్నారు.