ప్రకృతి వ్యవసాయమే రైతులకు స్థిర ఆదాయానికి మార్గం
ఎల్‌నినో పరిస్థితుల్లో అంతర పంటల సాగుపై దృష్టి పెట్టాలి: స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రకృతి వ్యవసాయం ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే ఉత్తమ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు.
శనివారం గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. విత్తన గుళికలతో సాగు చేసిన పొలాల్లో మొలక శాతం అధికంగా ఉండడం, మొక్కల పెరుగుదల సమానంగా కనిపించడం, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉండడం వంటి అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల్లో గ్రామ రైతులు సమూహాలుగా ఏర్పడి పీఎండీఎస్‌తో పాటు ఇతర అంతర పంటలను సాగు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉన్నప్పటికీ ఇటువంటి పంటల సాగు రైతులకు స్థిరమైన దిగుబడులు, ఆదాయాన్ని అందిస్తుందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు తమ భూములను బీడుగా ఉంచకుండా ప్రధాన పంటతో పాటు అంతర పంటలను తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. ఏడాది పొడవునా భూమి పంటలతో కళకళలాడేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
పీఎండీఎస్‌లో సాగు చేసే నవధాన్యాల పంటలను పశువులకు మేతగా వినియోగిస్తే వాటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరిగి రైతుల ఆదాయం అధికమవుతుందని వివరించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ఏదో ఒక పంట ద్వారా రైతులు తప్పనిసరిగా ఆదాయం పొందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, ఇందుకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.
అనంతరం గుడిపాల మండల రైతులకు ఎన్‌ఎంఈఓ-ఓఎస్ పథకం కింద 100 శాతం రాయితీతో సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే పీఎండీఎస్ కిట్లు, సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, డీపీఎం కె. శివశంకర్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ. మురళి, సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఉమా, గుడిపాల మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
