డ్వాక్రా ఉద్యోగుల యోగాసనాలతో కార్గిల్ పార్క్‌లో సందడి

డ్వాక్రా ఉద్యోగుల యోగాసనాలతో కార్గిల్ పార్క్‌లో సందడి

యోగాంధ్ర-2026లో భాగంగా భారీగా పాల్గొన్న డీఆర్‌డీఏ సిబ్బంది

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : యోగాంధ్ర-2026 వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సుమారు 200 మంది సిబ్బంది ఒకేచోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతత, శారీరక ఉల్లాసాన్ని అందించడంలో యోగా ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ జిల్లా పథక సంచాలకులు కిరణ్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, యోగా గురు మురళి పాల్గొని సిబ్బందికి పలు రకాల యోగాసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు.

ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని వారు సూచించారు. యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని వివరించారు.

ఈ శిబిరంలో డీఆర్‌డీఏకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీవోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు.