మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
–రైతులకు గిట్టుబాటు ధర అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం
-ధరల తేడాపై కేంద్రంతో చర్చలు… రైతులకు నష్టం జరగనివ్వం
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. మొక్కజొన్న ధరల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల వెంటే నిలుస్తుందని అన్నారు.
మొక్కజొన్న రైతుల సమస్యను సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని, కేంద్రానికి లేఖ రాసి పరిస్థితిని వివరించారని తెలిపారు. రైతులకు భారం కాకుండా ఉండేలా కేంద్రం నుంచి అదనపు సహాయం, నిధులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర రైతుల సమస్యలను అర్థం చేసుకుని సహకరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అధిక వ్యయాలు, అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ యుద్ధ ప్రభావం వంటి కారణాలతో మార్కెట్‌లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
అయినప్పటికీ రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఈ సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయని ప్రచారం చేసి రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు రైతులకు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందన్నారు. గతంలో కూడా పలు పంటల విషయంలో మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని రైతులను ఆదుకుందని మంత్రి గుర్తు చేశారు. ధాన్యం, మిర్చి, మామిడి, కోకో, పొగాకు, ఉల్లి, టమాటా,బొప్పాయి వంటి పంటల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టి రైతులకు భరోసా కల్పించిందన్నారు.
అదే విధంగా ఇప్పుడు మొక్కజొన్న రైతుల విషయంలో కూడా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన విద్యుత్, సాగునీరు, నీటి భద్రత, పెట్టుబడి సహాయం వంటి అంశాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పీఎం కిసాన్, అన్నదాతా సుఖీభవ పథకాల కింద గత నెలలోనే మూడో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు దారులు, కంపెనీలు కూడా రైతులు పెట్టిన ఖర్చును దృష్టిలో పెట్టుకుని కొనుగోలు ధరలను పెంచాలని మంత్రి కోరారు. రైతులు, కొనుగోలు దారులు పరస్పర విశ్వాసంతో వ్యవహరించి రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు జరపాలని సూచించారు.
ప్రభుత్వం, కొనుగోలు దారులు, రైతులు కలిసి పనిచేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర అందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
