జిల్లాలో సమృద్ధిగా ఎరువులు..
బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
యూరియా కొనుగోలుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి..
అక్రమాలకు పాల్పడితే డీలర్ లైసెన్స్ సస్పెండ్
తిరుపతి, ఆంధ్రప్రభ: ఖరీఫ్–2026 సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ, ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలపై ఆయన వివరాలు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేరకు ఎరువుల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలో ఖరీఫ్–2026 సీజన్లో వ్యవసాయ, ఉద్యాన, ఇతర పంటలు కలిపి మొత్తం 92,620 హెక్టార్లలో సాగు జరుగుతోందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అన్ని రకాల ఎరువుల అవసరాన్ని వ్యవసాయశాఖ 53,050 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసిందని చెప్పారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తుగా ఎరువుల నిల్వలు ఏర్పాటు చేసిందని వివరించారు. జూలై–2026 నాటికి జిల్లాకు మొత్తం 21,929 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, అందులో 17,775 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జిల్లాలో 14,860 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిలో హోల్‌సేల్ డీలర్ల వద్ద 272 మెట్రిక్ టన్నులు, ఏపీ మార్క్‌ఫెడ్ వద్ద 10,068 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 3,884 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద 482 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల వద్ద 154 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయని వివరించారు. అవసరానికి అనుగుణంగా యూరియాను నిరంతరం సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 4,465 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 1,994 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 11,316 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా సమీపంలోని అధీకృత విక్రయ కేంద్రాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో పారదర్శకత పెంపొందించడంతో పాటు ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ డిజిటల్ విధానాన్ని జూన్–2026 నుంచి అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ విధానం ప్రకారం యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులను కొనుగోలు చేయాలంటే రైతులు ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల ఎరువులు నిజమైన రైతులకే చేరడంతో పాటు అక్రమ నిల్వలు, దారి మళ్లింపులకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు.
వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాలు లేని రైతులకు కూడా వారు సాగు చేస్తున్న పంటల ఆధారంగా ఏపీఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసి ఎరువులు అందించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలులో ఉండగా, జిల్లాలో ఇప్పటివరకు 42,539 మంది రైతులకు 2,26,698 యూరియా బస్తాలు, 16,751 డీఏపీ బస్తాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని ఎరువుల విక్రయ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. యూరియాను గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధిక ధరకు విక్రయించడం, ఇతర ఉత్పత్తులను బలవంతంగా జతచేసి విక్రయించడం (ట్యాగింగ్) వంటి అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించడం, ట్యాగింగ్ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినట్లు తేలితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతిరోజూ నిర్వహించే తనిఖీలు, గుర్తించిన అక్రమాలు, తీసుకున్న చర్యలపై జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిక సమర్పించాలని మండల వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్. ప్రసాద్‌రావు, ఏడీ ధనుంజయరెడ్డి, ఏఓ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
