అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం !

  • రాయలచెరువు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
  • గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు ఆదిమూలం, బొజ్జల సుధీర్ రెడ్డి
  • ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • గ్రామాలను శుభ్రం చేసి, వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని వెల్లడి

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): ఓలూరు రాయల చెరువు ముంపులో నష్టపోయిన ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

ఓలూరు రాయల చెరువుకు గండి పడి ముంపుకు గురైన గ్రామాలను ప్రాంతాలను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో మొత్తం గ్రామాలను శుభ్రం చేసి, వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. చాలా నివసాలు తడిగా ఉన్నాయని, విద్యుత్ సరఫరా జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కారణంగానే మరో రెండు రోజుల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు.

నష్టపరిహారం అందిస్తాం

రెండు రోజుల పాటు ప్రజలకు అవసరమైన భోజనం, నీటి సదుపాయాలు, అవసరమైన దుప్పట్లను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. తాత్కాలికంగా ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాసంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నీటితో మునిగిన ఇళ్లలను శుభ్రం చేసుకోవడానికి ప్రతి ఇంటికి రూ.10,000 చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇవ్వనున్నట్టు తెలిపారు. చనిపోయిన మేక, గొర్రెకు రూ.7,500, ఆవుకు రూ.40,000, ఒక గేదెకు రూ.50,000 చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. అదనంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, రూ.3,000 వంట సామానుల కోసం అందజేస్తామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి కొత్త స్థలాలు కేటాయించి, ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల పక్షాన ప్రభుత్వం

ముఖ్యమంత్రి సూచనలతో ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతోందని, ఎవరూ నిరాశ చెందవద్దని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యవసర సరుకులైన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ చక్కర, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, రూ.3 వేల రూపాయలు, దుప్పట్లును సత్యవేడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రాధాకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవి, డీఆర్డీఏ పీడీ శోభన్ బాబు, మెప్మా పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర రావు, సంబంధిత శాఖ మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అసిస్టెంట్ ఇంజనీర్‌పై సస్పెన్షన్ వేటు

ఒల్లూరు రాయల చెరువుకు గండి పడకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ బాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈపై అభియోగాలు నమోదు చేసి శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.