అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత
కారు సీజ్.. ఇద్దరు నిందితులు అదుపులో
తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ: అక్రమంగా రవాణా చేస్తున్న నల్ల బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు తొర్రూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాల కేంద్రం సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారు కనిపించింది. తిరుమలగిరి వైపు నుంచి తొర్రూర్ వైపు వస్తున్న జీజే 05 జేబీ 0969 నంబర్ గల తెల్లని స్విఫ్ట్ కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ పోలీసులను గమనించి పారిపోవడానికి యత్నించాడు.
అయితే పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జాకర్ గణపత్ (32)గా గుర్తించారు. అతడు కేకర్ గ్రామానికి చెందినవాడని, మరో వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రంలోని భార్మేర్ జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత నల్ల బెల్లం, పట్టికను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో కొనుగోలు చేసి, డోర్నకల్ పరిసర తండాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కారులో తనిఖీ చేయగా 17 బస్తాల నల్ల బెల్లం, ఒక బస్తా పట్టిక లభ్యమయ్యాయి. మొత్తం 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం, 50 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ.93 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తొర్రూర్ ఎస్‌ఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 8.50 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత
