బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మంలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శ్రీకారం
పువ్వాడ అజయ్
ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ చొరవ తీసుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ గ్రూప్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో శ్రీకారం చుట్టి, మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించి రైతులకు అధిక ఆదాయం కల్పించడం, దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా పలు చర్యలు చేపట్టిందన్నారు. రైతులు పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేసి ప్రాసెస్ చేసేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి, వివిధ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఆ కృషి ఫలితంగానే ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ అగ్రోవెట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటైందన్నారు. గోద్రేజ్ అగ్రోవెట్తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుని రైతులకు మార్కెట్, ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు.
ఆయిల్ పామ్ సాగును మిషన్ మోడ్లో విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి, రైతులకు పరిశ్రమలతో అనుసంధానం కల్పించే విధానాన్ని అమలు చేసిందన్నారు. ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు పెట్టుబడులను ప్రోత్సహించి, తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వంటనూనెల దిగుమతులపై దేశ ఆధారాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడం వంటి లక్ష్యాలతో పనిచేసినట్లు పేర్కొన్నారు.
భారతదేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఆయిల్ పామ్ ఉత్పత్తి పెంపునకు, ఆహార నూనెల స్వయం సమృద్ధి సాధనకు ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించిందన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతులకు సమీపంలో ప్రాసెసింగ్ సౌకర్యాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా పనిచేసి ఆయిల్ పామ్ రంగానికి బలమైన పునాది వేసిందన్నారు. తెలంగాణను ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ స్థాపనకు కృషి చేసినట్లు తెలిపారు.
