ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళతాం.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ
దండెపల్లి, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మంజూరు చేసిన స్కూల్ బ్యాగులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి. చంద్రయ్య లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 150 మంది విద్యార్థులకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్కూల్ బ్యాగులను అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో 110 మంది విద్యార్థులకు అందించడం జరిగిందని, మిగిలిన వారికి పంపిణీ చేస్తామని తెలిపారు.
పాఠశాలలో విద్యార్థులు క్రింద కూర్చోకుండా విద్యార్థులకు సరిపడా బెంచీలు అందించేందుకు ట్రస్ట్ తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నీటి సౌకర్యం కల్పించేందుకు బోర్ వెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

