మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన ర్యాలీ

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, దేశంలో మహిళలు చట్టసభల్లోకి రాకుండా అడ్డుపడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తే, దానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆరోపించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, బిజెపి మేడ్చల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, ఎల్లంపేట కౌన్సిలర్ మహేశ్వరి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌరవరం జగన్ గౌడ్, సముద్రాల హంస కృష్ణ గౌడ్, బిజెపి జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ లవంగ శ్రీకాంత్, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, ఎల్లంపేట మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, మేడ్చల్ ప్రధాన పట్టణ కార్యదర్శి ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply