తెలంగాణలో జనగణన షెడ్యూల్ వివరాలు

తెలంగాణలో జనగణన షెడ్యూల్ వివరాలు
- ప్రథమ పౌరుడు గవర్నర్తో ప్రారంభించిన అధికారులు
- స్వయంగా వివరాలు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపు
- సుపరిపాలనకు, వనరుల సమాన పంపిణీకి పునాది: శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో డిజిటల్ జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. Census of India–2027 కోసం స్వీయ నమోదు (Self Enumeration) కార్యక్రమాన్ని తెలంగాణ లోకభవన్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆదివారం ప్రారంభించారు. ఆన్లైన్ స్వీయ నమోదు ద్వారా తన వివరాలను నమోదు చేసి, తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం జూబ్లీహిల్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొని తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విశేషంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
జనాభా లెక్కల నమోదుకు సంబంధించిన మొదటి దశలో చేపట్టిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంపై సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జనగణనలో ప్రజలందరూ పాల్గొనాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. “జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమం. ఇది మన జనాభా, వారి సామాజిక-ఆర్థిక స్థితిపై సమగ్ర సమాచారం అందిస్తుంది. ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి ఇది పునాది. అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా విధానాలు రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం వంటి రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది. జాతీయ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ప్రభుత్వానికి ఇది సహకరిస్తుంది,” అని గవర్నర్ తెలిపారు.
తెలంగాణలో స్వీయ గణన దశ ఆదివారం నుంచి మే 10 వరకు కొనసాగుతుందని, మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశి కిరణ్ చారి తదితరులు పాల్గొన్నారు.
