రెండేళ్లలో గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు పూర్తి రూపం
రెండేళ్లలో గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు పూర్తి రూపం
- కేంద్ర మంత్రి పెమ్మసాని
ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో:
గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనులను వేగవంతం చేసి వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టును నిర్దిష్ట దశకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గుంటూరు ఛానల్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
గుంటూరు ఛానల్ 1972లో నిర్మించబడిన కీలక సాగునీటి ప్రాజెక్టు అని, ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్కుల సామర్థ్యంతో సుమారు 27 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కాలువ విస్తరణ, ఆధునికీకరణ అవసరమని పేర్కొన్నారు. 2017-18లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.250 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. భూసేకరణ కోసం రూ.100 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రైతులకు రూ.28 కోట్లకు పైగా పరిహారం అందించినట్లు వెల్లడించారు.
కొత్త టెండర్ల కారణంగా ఆలస్యం, అదనపు వ్యయభారం లేకుండా పాత ఒప్పందాల ప్రకారమే పనులు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాలువ తవ్వకాల నుంచి వచ్చిన మట్టి పొలాల్లో నిల్వ సమస్యలు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే అదనపు అంచనాలు రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ రైతుల ఎన్నో ఏళ్ల కల అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ పనులను నిరంతరంగా కొనసాగించి రైతులకు పూర్తి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, డీసీ చైర్మన్లు అయినపూడి నాగేశ్వరరావు, కల్లూరి కుసుమ, ఏపీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కాసు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
