కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఆర్ ఎస్ యూ తీవ్ర ఆందోళన
కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఆర్ ఎస్ యూ తీవ్ర ఆందోళన
డి ఈ ఒ కార్యాలయం ఎదుట ధర్నా
ఆకస్మిక తనిఖీలు, ఫీజుల నియంత్రణకు డిమాండ్
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్పెషల్ ఫీజులు పేరుతో తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని ఆరోపిస్తూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డి ఈ ఒ చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘురామిరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఏసీ క్లాస్‌రూమ్ ఫీజు వంటి పేర్లతో లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పుస్తకాలు, యూనిఫాంలను స్కూళ్లలోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఓపెన్ మార్కెట్ స్వేచ్ఛను నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ ఎస్ యూ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లులలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో విద్యాశాఖ ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం ఫీజుల నియంత్రణ అమలు చేయాలి, అదనపు ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలి, పుస్తకాలు, యూనిఫాంలను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే స్వేచ్ఛ కల్పించాలి, స్కూళ్లలో బలవంతపు అమ్మకాలు పూర్తిగా నిషేధించాలి, జిల్లా స్థాయి ఫీజు నియంత్రణ మానిటరింగ్ కమిటీలో విద్యార్థులు, తల్లిదండ్రుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై డి ఈ ఒ 10 రోజుల్లో స్పష్టమైన చర్యలు ప్రకటించకపోతే జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల ముందు నిరవధిక ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని ఆర్ ఎస్ యూ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ నాయుడు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్ కుమార్ నాయుడు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
