Indrakeeladri | శాకాంబరీ శోభతో ఇంద్రకీలాద్రి…

  • పెరిగిన మహిళా భక్తుల రాక
  • హరిత వర్ణ అలంకరణలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం…
  • పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానమైన ఆలయ ప్రాంగణం
  • వేద విద్యార్థులకు ‘వేద దివ్య దర్శనం’ పాలసీ అమలు…
  • దేవస్థాన చరిత్రలో తొలిసారి ఈఓ శీనా నాయక్ కీలక నిర్ణయం
  • 32 సారె బృందాలు… 16,890 మంది భక్తుల సారె సమర్పణ


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న శాకాంబరీ ఉత్సవాలు రెండో రోజు మంగళవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. హరిత వర్ణ ఆభరణాలు, వరి కంకుల తోరణాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారితో పాటు ప్రధాన ఆలయం, ఉపాలయాల్లోని దేవతామూర్తులను అపూర్వంగా అలంకరించడంతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఈ అలంకరణను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా కదంభ ప్రసాదం పంపిణీ చేయగా, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. గంట గంటకూ భక్తుల సంఖ్య పెరగడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకున్నారు.

వేద విద్యార్థులకు అమ్మ దర్శనం..

శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా దేవస్థాన చరిత్రలో తొలిసారిగా వేద విద్యార్థుల కోసం ‘వేద దివ్య దర్శనం’ పాలసీని అమల్లోకి తీసుకువచ్చారు. ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శీనా నాయక్ ఆదేశాల మేరకు పోరంకి దేవస్థాన వేదపాఠశాల విద్యార్థులకు ఇకపై ప్రతి పండుగ, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష దినాల్లో ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించిన ఫైలుపై ఈఓ సంతకం చేయగా, శాకంభరీ ఉత్సవాల వేళ నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిర్ణయాన్ని వైదిక కమిటీ, అర్చకులు, భక్తులు హర్షిస్తూ దేవస్థానాన్ని అభినందించారు.

ఉత్సాహంగా ఆషాడ ఉత్సవాలు…

ఆషాఢ సారె ఉత్సవాలు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావిస్తూ మహిళలు పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, సారెలతో పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. 32 సారె బృందాల ద్వారా 16,890 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ఉచిత దర్శనం, కదంభ ప్రసాదం ఏర్పాటు చేసింది. శాకంభరీ ఉత్సవాలు, ఆషాఢ సారె ఉత్సవాలు ఒకేసారి కొనసాగుతుండటంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.